Monday 10 July 2017

మౌనం ! అది మనపాలిట శాపం !

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు !!!

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అలాగే మనం కూడా వృత్తి మనుగడ కోసం మన సేవల ప్రాముఖ్యత అందరికీ అర్థమైయ్యే రీతిలో, ప్రభుత్వం సకాలంలో మన వ్యవస్థను సరైన రీతిలో గుర్తించే దిశగా మన ప్రయత్నం తీవ్రతరం చేయాలి, మనకు పరిపూర్ణంగా మరియు క్షుణ్ణంగా తెలియని ప్రభుత్వ భవిష్యత్ తీర్మాణాలను అపార్ధం చేసుకొని తప్పుగా ఊహించుకొని పాలకులను నిందిచడం మాని, కనీసం ఇప్పటికైనా ఆలోచనతో, విజ్ఞ్యతతో, సోదరభావంతో, మానవత్వంతో అందరం కలసికట్టుగా వ్యవహరించడానికి ప్రయత్నిద్దాం మన జీవనాధారాన్ని కాపాడుకుందాం.

నాడు మన మనుగడ కొరకు సల్పిన పోరాటంలో మనమందరం కలిసికట్టుగా ఒక్కటై నేటి పాలకుల సారధ్యంలో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక్క భారీ ప్రభంజనం సృష్టించాము, అలా రాష్ట్ర సాధనలో ఒక్క కీలక పాత్ర పోషించిన మనమంతా సేవే పరమావధిగా ఎంతో విలువలతో కూడినట్టి దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ అనుబంధ సేవలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విద్యావంతులు ఏర్పర్చుకున్న స్వయంఉపాది మన వృత్తి, అట్టి గౌరవ వృత్తి అంతరించి పోకుండా అందరమూ ఒక్కటై, ఒక చక్కటి ప్రణాళికతో పాలకుల ఒప్పించి ప్రజలకు మన సేవలు అందిద్దాం, అలా మన వృత్తికి సరైన గుర్తింపు సాధించుకుందాం.

నేడు మన వృత్తిపైన సరైన అవగాహన లేని వారు విచక్షణారహితంగా పవిత్రమైన మన వృత్తిని నోటికొచ్చినట్టుగా పత్రికలలో హీనంగా మధ్యవర్తులు, బ్రోకర్లు, దుర్మార్గులు, దగాకోరులు అని దిగజార్చి సంభోదిస్తుంటే, విగ్రహాలలా చోద్యం చూస్తూ ఉందామా ? 
(లేక)
మనకు కొన్ని విలువలు ఉన్నాయి, అవి దృష్టిలో ఉంచుకొని మర్యాదగా సంభోదించాలని గుర్తు చేద్దామా?

మనకెందుకు అన్న వైఖరి అందరం అవలంబించుకుందాం, జరిగేది జరగక మానదు అనుకోని మౌనం వహిద్దామా?
(లేక)
స్వార్థం మరియు భయంచే బందీగా బ్రతికితే నీవు రేపు నీ వెంట నీ నీడ కూడా వొస్తుందో లేదో అని అను క్షణం అనుమానంతో, ఆత్మవంచన చేసుకొని కుములుతూ నీ తప్పుకు వ్యవస్థను నిందించుకుంటూ బ్రతుకుదామా?
(లేక)
సమిష్టిగా, అంటే ఒకరి కొరకు అందరం అన్నట్టుగా కలిసికట్టుగా ఒక్కటై నిబద్ధతతో మన వృత్తిని నిజాయితీగా ఆచరించి మన విలువలను కాపాడుకుందామా?

పోన్లే పనికిమాలిన సోది అనుకుంటే ఎలా ఉంటుందో ఏమత్రం ప్రమేయం లేకున్నా ఊహించని పరిస్థితి ఎదురై అమాయకమైన నీ జీవితం అగమ్యగోచరంగా మారినప్పుడు తెలుస్తుంది, ఆ నొప్పేమిటో ఆ వ్యధ ఏమిటో.

ఈనాటి మన ఉరుకులు పరుగుల జీవితంలో మనలో ఒక్కరికి ఆపద వాటిల్లినప్పుడు కనీస మానవత్వంతో మందలించడానికి కూడా సమయం ఇవ్వలేని మనము మనుషులమేనా..? అనిపించి, మనలో ఇలాంటి స్వార్థ భరితమైన ఆలోచనా విధానం మన వృత్తి మనుగడను కూడా అంతరించివేస్తుందన్న ఒకేఒక్క అంశం ద్వారం పుట్టుకకు కారణం, దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ అనుబంధ సేవల ప్రాముఖ్యత అందరికీ తెలపడం తత్ద్వారా మన వృత్తికి సరైన విలువలతో కూడిన గుర్తింపు సాధించుకోవడం ద్వారం ముఖ్య లక్ష్యం.

ద్వారం దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ అనుబంధ సేవల వృత్తి వ్యవస్థకు సహకరించే, సంక్షేమం కోరే ప్రతిఒక్కరి నేస్తం....

ఇట్లు

మీ
సంగం బాలాజీ  
B. Com., M. B. A., LL. B.
Blog Editor -  dwaaram (ద్వారం)
https://www.blogger.com/profile/01898430331694300745
email: dwaaram@gmail.com

2 comments: